చిన్ని అడుగు నేపథ్యం
ఇతరులకు సహాయం చేయడం చిన్నతనం నుంచే కుటుంబ సభ్యుల
ద్వారా అలవడింది. దాన్ని జీవితంలో ప్రతి అడుగులో నాతొ భావాలు కలసిన వారిని
కలుపుకుంటూ తోచిన సహాయం కావలసిన వారికి చేస్తూ ప్రయాణిస్తూ వున్నాను. BSNL సీజీఎం
కార్యాలయంలో శేషమాంబ గారితో పరిచయం ఈ గుణాన్ని ఇనుమడింపజేసింది. 1999 లో శేషమాంబ గారు ఒక గ్రూపుగ ఏర్పడి , సహాయ
కార్యక్రమాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచనను పంచుకున్నారు. కొంతమంది స్పందించారు.
అందులో నేనూ ఒకరిని.
మేము అనాధ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు
వెళ్లేవారము. ఇంట్లో ఎక్కువైనా ప్రతి వస్తువు ఎవరికైనా ఉపయోగపడుతుందా ? అని
ఆలోచించేవారము. ఇతరుల కోసం - అన్న తలపు నేపథ్యంగ ఉండేది. ప్రకృతి వైపరీత్యాల
సమయాల్లో స్పందించాం. పండుగల సమయంలో ఇతరుల గురించి ఆలోచించాము.
శేషమాంబ గారు పదవీ విరమణ చేసిన తరువాత నేను బాధ్యతలు తీసుకుని
కొనసాగిస్తున్నాను. సభ్యులు వస్తూ వుంటారు - పోతూ వుంటారు. కానీ మా కార్యక్రమాలు
నదీ ప్రవాహంలా సాగి పోతూ వుంది.
వరద కర్నూలు లో అయినా , కాశ్మీరు లో అయినా
చేయూతనిచ్చాము. నాగాలాండ్ లో ప్రజలే అబ్బురపడేలా సహాయాన్ని చేసాం. ప్రతి చిన్నారి
చక్కగా చదువుకొని దేశానికి ఉపయోగపడాలి అన్నది మా ఆకాంక్ష. అన్ని చోట్లకు
వెళ్లలేము. అందుకని బాగా తెలిసిన వారిని, చిన్ననాటి
స్నేహితులను, నమ్మకమైన వారిని భాగస్వాములుగా చేయడం ద్వారా ఈ యజ్ఞం
నిర్విరామంగా కొనసాగుతోంది.
ఇలా చిన్ని చిన్ని అడుగులతో ముందుకు సాగుతూ వున్నాం. ఎన్ని అడుగులు వేసాం
అన్నది లెక్క కాదు- ఇతరుల మనసుల్లో ఆలోచనను కలిగించి వారి
సహకారంతో ఆర్తులకు చేయూత నివ్వ అడుగుగు వేయడమే !!
మీ
నగరూరు పద్మ